ప్రతినిధి-2 టీజర్‌... ఏపీ ప్రజలకే చెపుతున్నారా?

నారా రోహిత్ మళ్ళీ చాలా కాలం తర్వాత తన సూపర్ హిట్ సినిమా ప్రతినిధికి సీక్వెల్ ప్రతినిధి-2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్‌ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులను అద్దం పడుతున్నట్లుగా ఉంది.

ఎన్నికలలో గెలిచేందుకు పార్టీలు హామీలు ఇవ్వడం, వాటి కోసం అప్పులు చేసి మళ్ళీ ప్రజల నెత్తినే రుద్దుతుండటం, మరో పక్క అవినీతి, అక్రమాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేయడం వంటి అంశాల చుట్టూ అల్లుకున్న కధే ఈ ప్రతినిధి-2 అని టీజర్‌ చూస్తే అర్దమవుతోంది. 

ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు విడుదల కాబోతున్న ఈ సినిమాలో, “ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బయటకు వచ్చి ఓటు వేయండి. లేకుంటే ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోండి. అదీ కుదరదనుకుంటే చచ్చిపోండి,” అంటూ  టీజర్‌లో నారా రోహిత్ డైలాగ్ విన్నప్పుడు ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను ఉద్దేశ్యించి చెపుతున్నట్లే అనిపిస్తుంది.   

మూర్తి దేవగుప్తపు కధ, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ రాజకీయ అక్రమాలను ప్రశ్నించే ఓ జర్నలిస్టుగా నటించగా, సిరి లీల హీరోయిన్‌గా నటించింది. సచిన్ కేడేకర్, రఘుబాబు, పృధ్వీరాజ్, అజయ్, తనికెళ్ళ భరణి, అజయ్ గోష్, రఘురామ కృష్ణరాజు కారుమంచి, జిషు సేన్‌ గుప్తా, సప్తగిరి, దినేష్ తేజ్, ప్రవీణ్, ఉదయభాను, ఇంద్రజ ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు సంగీతం: సాగర్ మహతి, కెమెరా: నాని చమిడిశెట్టి, ఎడిటింగ్: రవితేజ గిరిజాల, యాక్షన్: శివరాజు, పృధ్వీ, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నే చేశారు. వనర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఆంజనేయులు శ్రీ తోట, కుమార్‌ రాజా, సురేంద్రనాథ్ బొలినేని కలిసి ఈ సినిమా నిర్మించారు. ప్రతినిధి-2 వచ్చే నెల విడుదల కాబోతోంది.