ఖైరతాబాద్ ఆర్టీవోలో పుష్ప... డ్రైవింగ్ లైసెన్స్ కోసం!

ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ బుధవారం హైదరాబాద్‌, ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయానికి వచ్చి అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు నింపి, సంబందిత డాక్యుమెంట్స్ సంతకం చేసి అధికారులకు సమర్పించారు. అల్లు అర్జున్‌ అక్కడికి రావడంతో ఆర్టీవో అధికారులు, సిబ్బంది ఆయనతో సెల్ఫీలు దిగారు. అల్లు అర్జున్‌ వచ్చిన విషయం తెలుసుకొని దారిన పోయే ప్రజలు కూడా అక్కడకు చేరుకోవడంతో చాలా సేపు ఖైరతాబాద్‌ పరిసరాలలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

అయితే ఇంత హటాత్తుగా అల్లు అర్జున్‌కి అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు అవసరం పడింది? పుష్ప-2 సినిమాలో కొన్ని సన్నివేశాలు విదేశాలలో షూటింగ్‌ జరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కనుక దాని కోసమేనా? లేదా మరేదైనా కారణం ఉందా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న పుష్ప-2 సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో కూడా రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు జగపతిబాబు కూడా పుష్ప-2లో చేరారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.