రామ్ చరణ్‌-బుచ్చిబాబు సినిమా పూజా కార్యక్రమం రేపే

ఆర్‌ఆర్ఆర్ సినిమా 2022 మార్చి 25న సినిమా విడుదలైంది. దాని తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్‌’ షూటింగ్‌ ఇంకా సాగుతూనే ఉంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

అంటే దాదాపు రెండున్నరేళ్ళగా రామ్ చరణ్‌ తెలుగు సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదన్న మాట! ఆర్ఆర్ఆర్ ఎంత సూపర్ హిట్ అయినప్పటికీ, అంత పాపులారిటీ ఉన్న ఓ యువ హీరో ఒక్కో సినిమాకి ఇంత గ్యాప్ తీసుకోవడం అభిమానులకు నిరుత్సాహం కలిగిస్తుంది. 

నిన్న విశాఖలో ‘గేమ్ చేంజర్‌’ షెడ్యూల్ పూర్తి చేసిన రామ్ చరణ్‌, దర్శకుడు బుచ్చిబాబుతో అనుకున్న సినిమా ని రేపటి (బుధవారం) నుంచి మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాకు రేపు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు చేసి లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించబోతున్నామని ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది. కానీ గేమ్ చేంజర్‌ సినిమా షూటింగ్‌ పూర్తయ్యే వరకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ మొదలయ్యే అవకాశం లేదు. కానీ ఆలోగా ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయి. 

రామ్ చరణ్‌-బుచ్చిబాబు సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించబోతోంది. ఆమె ఇప్పటికే జూ.ఎన్టీఆర్‌కు జోడీగా దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్. రహమాన్ సంగీతం అందించబోతున్నారు.