.jpeg)
ఓ పెద్ద హీరో సినిమా సినిమా కోసం అభిమానులు, ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూడటం చాలా సర్వసాధారణమే. కానీ కేవలం రూ.45 కోట్ల బడ్జెట్తో ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా అనే ఇద్దరు కుర్రాళ్ళు తీసిన హనుమాన్ సినిమా కోసం అందరూ ఎదురుచూడటం విశేషమే.
జనవరి 12న థియేటర్లలో విడుదలైన హనుమాన్, నెలన్నర తర్వాత అంటే ఫిబ్రవరి నెలాఖరులోగానే ఓటీటీలోకి వచ్చేసి ఉండాలి. కానీ దాంతో పాటు విడుదలైన గుంటూరు కారం, సైంధవ్ వంటి పెద్ద సినిమాలు ఓటీటీలోకి వచ్చి వెళ్లిపోయాయి కానీ హనుమాన్ మాత్రం ఇంతవరకు రాకపోవడంతో ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా దాని కోసం ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేలకు ఈ సినిమా హిందీ వెర్షన్ శనివారం సాయంత్రం నుంచి జియో సినిమా ఓటీటీ చానల్లో, తెలుగు వెర్షన్ ఆదివారం ఉదయం నుంచి జీ5 ఓటీటీలో ప్రసారం అవుతున్నాయి. దీని కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఓటీటీ ప్రేక్షకులు వెంటనే చూసేసి, సినిమా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జలపై ప్రశంశలు కురిపిపిస్తున్నారు.
ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.350 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.
ప్రశాంత్ వర్మ తన తదుపరి చిత్రం పేరు ‘జై హనుమాన్’ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.