మహేష్‌ బాబు-రాజమౌళి సినిమా షూటింగ్‌ ఎప్పటి నుంచంటే

మహేష్‌ బాబు-రాజమౌళి సినిమా అప్‌డేట్ గురించి అభిమానులే కాదు సినీ –ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబందించి నిత్యం ఏదో ఓ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమాలో మహేష్‌ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా కాదా? అనేది రాజమౌళి చెప్తేగానీ తెలీదు. కానీ ఈ ఊహాగానాలు నిజమైనా కాకపోయినా మహేష్‌ బాబు అభిమానులకు ఇది చాలా సంతోషం కలిగించేదే. 

ఈసారి రాజమౌళి ఈ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నందున, దేశంలోని అన్ని సినీ పరిశ్రమలలో నటీనటులతో పాటు కొంతమంది అంతర్జాతీయ నటీనటులు కూడా ఉండబోతున్నారనేది వాస్తవమే. ప్రస్తుతం నటీనటుల అన్వేషణ సాగుతున్నట్లు తెలుస్తోంది.  

ఈ సినిమా కోసం మహేష్‌ బాబు శరీరాకృతి, బాడీ లాంగ్వేజ్, సినిమాలో హీరో పాత్ర తదితర అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఇప్పటి వరకు 7-8 రకాల స్కెచ్‌లు సిద్దం చేసి వాటిలో నుంచి 2-3 సెలక్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల మహేష్‌ బాబు సోషల్ మీడియాలో పెట్టిన తన కొత్త ఫోటో ఈ సినిమాకు సంబందించినదే అని పుకార్లు వచ్చినప్పటికీ, అది ఓ వాణిజ్య ప్రకటన కోసం తీసుకున్న ఫోటో అని తేలింది. ఈ సినిమా షూటింగ్‌ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేవరకు మహేష్‌ బాబు రూపురేఖలు ఎవరికీ కనబడకుండా ఉండాలని రాజమౌళి షరతు లేదా నియమం ఉంది. కనుక ఆలోగా ఒప్పుకొన్న వాణిజ్య ప్రకటనలన్నీ మహేష్‌ బాబు పూర్తిచేస్తున్నారు. 

మహేష్‌ బాబు-రాజమౌళి సినిమా రెగ్యులర్ షూటింగ్‌ ఈ ఏడాది జూన్ లేదా జూలై నెల నుంచి ప్రారంభం కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. 

ఈ సినిమా పూర్తి చేయడానికి రాజమౌళి కనీసం రెండు మూడేళ్ళుపైనే సమయం తీసుకుంటారు కనుక అంతవరకు అభిమానులకు మహేష్‌ బాబు సినిమాలు చూసే అవకాశం ఉండదు. కనుక రాజమౌళి తన నియమనిబందనలు సడలించి ఈ సినిమాకి సంబందించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తే అభిమానులు చాలా సంతోషిస్తారు.