
తెలుగు సినీ దర్శకులలో వరుసపెట్టి సినిమాలు తీయడానికి ఏమాత్రం ఆసక్తి చూపని వారిలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. రెండు మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నా చక్కటి సినిమాని అందిస్తుంటారు. కనుక తెలుగు ప్రేక్షకులు ఆయన సినిమాల కోసం ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తూనే ఉంటారు.
శేఖర్ కమ్ముల కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా ఓ సినిమా మొదలుపెట్టారు. ఆ సినిమాకి ‘కుబేర’ అని టైటిల్ ఖరారు చేసి నిన్న మహా శివరాత్రి సందర్భంగా ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు. దానిలో పరమ శివుడుకి కాశీ అన్నపూర్ణ బిచ్చం వేస్తున్న పోస్టర్‌ని చూస్తున్న ధనుష్‌ని చూపారు.
మహా శివరాత్రికి, తన సినిమా కధకు కూడా తగ్గట్లుగా ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేసి శేఖర్ కమ్ముల తన ప్రత్యేకతని మరోసారి చాటుకున్నారు. సమాజంపై డబ్బు ప్రభావం ఏవిధంగా ఉందో తెలియజేస్తూ ఈ సినిమా తీస్తున్నట్లు ఇదివరకు విడుదల చేసిన తొలి పోస్టర్ బట్టి అర్దమవుతుంది.
కుబేరలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.