షరతులు వర్తిస్తాయి: డిస్కౌంట్ కాదు... సినిమా పేరు!

కీడాకోలా ఫేమ్ చైతన్య రావు, భూమిశెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ సినిమా ట్రైలర్‌ నేడు విడుదలైంది. ఈ దేశంలో ఉన్న 80శాతం సామాన్యుల కధనే మన సినిమా అని సింపుల్‌గా సినిమా లైన్ చెప్పేశారు ట్రైలర్‌లో. 

కరీంనగర్‌లో ఓ దిగువ మద్య తరగతి కుటుంబానికి చెందిన హీరో చిరంజీవి, అదే ప్రాంతంలో ఉన్న హీరోయిన్‌ విజయశాంతిని పెళ్ళి చేసుకుంటాడు. తర్వాత వారిద్దరూ ఓ వ్యాపారంలో మోసపోయి ఎదురుదెబ్బ తింటారు. ఆ తర్వాత వారిద్దరూ జీవితంలో ఎటువంటి  సమస్యలు ఎదుర్కొని బయటపడ్డారనేది సినిమా స్టోరీ. 

ఈ సినిమాలో వారు ఎదుర్కొన్న సమస్యలను సామాన్య ప్రజలు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు స్వయంగా అనుభవించే ఉంటారు. కనుక సినిమా కధని గ్రిప్పింగ్‌గా తీసి ఉంటే హిట్ అవడం ఖాయం. 

ఈ సినిమాలో నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవ రాజ్‌భవన్‌ పాలమూరు, పద్మావతి, తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కుమార స్వామి (అక్షర), డైలాగ్స్: పెద్దింటి అశోక్ కుమార్, సంగీతం: అరుణ్ చిలువేరు, కెమెరా: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి, ఎడిటింగ్: వక్కంతం వంశీ కృష్ణ, రక్షిత్ కుమార్‌ చేశారు. 

ఈ సినిమాని స్టార్‌ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై శ్రీలత, నాగార్జున్ సామాల, శారద, శ్రీష్ కుమార్‌ గుండా, విజయ, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు కలిసి నిర్మించారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.