ఎవరినైనా నొప్పిస్తే నన్ను క్షమించండి: నాగబాబు

మెగా బ్రదర్స్ ముగ్గురిలో పెద్దవారైనా చిరంజీవి ప్రతీ మాటని చాలా ఆచితూచి మాట్లాడుతుంటారని తెలిసిందే. కనుక ఆయనను వేలెత్తి చూపే అవకాశం ఎవరికీ రాదు. కానీ ఆయన ఇద్దరు తమ్ముళ్ళు పవన్‌ కళ్యాణ్‌, నాగబాబు కాస్త ఆవేశపరులే అని అందరికీ తెలుసు. మళ్ళీ వారిద్దరిలో పవన్‌ కళ్యాణ్‌ చాలా సంయమనంతో మాట్లాడుతుంటారు కానీ నాగబాబు నోరు విప్పితే ఎంతటివాడినైనా ఖాతరు చేయరు. ఆ నోటి దురదే ఆయనకు బలం, బలహీనతగా కూడా మారిందని చెప్పవచ్చు. 

తాజాగా తన కొడుకు వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలైంటైన్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాగబాబు మాట్లాడుతూ “సినిమాలలో పోలీస్ అధికారి పాత్రలకు కనీసం 6 అడుగుల 3 అంగుళాలు ఎత్తున్న హీరోలైతేనే సరిపోతారు. 5 అడుగుల 3 అంగుళాల ఎత్తునవారు అంతగా నప్పరు,” అని అన్నారు. 

మెగా కుటుంబంలోనే రామ్ చరణ్‌, అల్లు అర్జున్‌,, నందమూరి కుటుంబంలో జూ.ఎన్టీఆర్‌ వంటి వారందరూ 6 అడుగుల కంటే తక్కువ ఎత్తున్నవారే కావడంతో, నాగబాబు వారిని ఉద్దేశ్యించే ఆ మాటలన్నారని వారి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయం నాగబాబు చెవిన పడటంతో ఆయన వెంటనే ట్విట్టర్‌లో తన మాటలను వెనక్కు తీసుకుంటున్నానని, వాటి వలన ఎవరైనా బాధపడిన్నట్లయితే క్షమాపణలు కోరుకొంటున్నానని ట్వీట్‌ చేశారు.