స్పిరిట్ హర్రర్ సినిమా కాదట... సందీప్ చెప్పేశారు

సందీప్ వంగర దర్శకత్వంలో ప్రభాస్‌ స్పిరిట్ అనే ఓ సినిమా చేయబోతున్నవిషయం తెలిసిందే.

ఇంతకాలం ప్రభాస్‌ మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి ఎడి 2898  సినిమాలతో చాలా బిజీగా ఉండగా, సందీప్ వంగా ‘యానిమల్’ సినిమాతో బిజీగా ఉండటం వలన వీరిద్దరి కాంబినేషన్‌లో స్పిరిట్ సినిమా ఇంకా మొదలవలేదు. 

కానీ ఇప్పుడు సందీప్ యానిమల్ పూర్తి చేసి ఖాళీ అవడంతో వెంటనే ‘స్పిరిట్’ ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టారు.

ఇటీవల యానిమల్ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు విలేఖరులు 'స్పిరిట్' హర్రర్ సినిమా అని సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాల గురించి చెప్పి వివరణ కోరగా ‘స్పిరిట్’ హర్రర్ సినిమా కాదని తేల్చి చెప్పేశారు. 

ఈ సినిమాలో ప్రభాస్‌ తొలిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా నటించబోతున్నారనే విషయం కూడా దర్శకుడు సందీప్ వంగా చెప్పారు. ఓ నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ ఎటువంటి సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటూ ముందుకు సాగుతుంటాడనేది స్పిరిట్ సినిమా కధ అని సందీప్ వంగ క్లుప్తంగా కధాంశాన్ని కూడా చెప్పేశారు. 

ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి కాగానే మే, జూన్ నెలల్లో రెగ్యులర్ షూటింగ్‌ మొదలుపెట్టి డిసెంబర్‌లోగా పూర్తి చేయగలిగితే వచ్చే సంక్రాంతికి స్పిరిట్ రావచ్చు లేకుంటే వచ్చే వేసవి సెలవులలో తప్పకుండా విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమాతో తొలిసారిగా పౌరాణికం, సలార్‌తో యాక్షన్ హీరోగా, ది రాజాసాబ్‌తో హర్రర్ కామెడీ, కల్కి ఎడి2898తో  సైన్స్ ఫిక్షన్, కన్నప్పతో మళ్ళీ శివుడిగా పౌరాణికం, సందీప్ వంగాతో పోలీస్ ఆఫీసరుగా విభిన్న పాత్రలతో అభిమానులకు ముందుకు వస్తుండటం చాలా సంతోషమే కదా?