పుష్ప-3 కూడా ఉంటుంది: అల్లు అర్జున్‌

టాలీవుడ్‌ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు ఓ సంతోషకరమైన విషయం చెప్పారు. బెర్లిన్ అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు వెళ్ళిన అల్లు అర్జున్‌, అక్కడ భారతీయ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ, “పుష్ప తర్వాత పుష్ప-2 సినిమా చేస్తున్నప్పుడు, ఇంత బలమైన ‘కాన్సెప్ట్’ మన చేతిలో ఉన్నప్పుడు దీనికి కొనసాగింపుగా పుష్ప-3 ఎందుకు తీయకూడదు? అనే ఆలోచన మాకు కలిగింది. 

పుష్ప సిరీస్‌లో మరికొన్ని సినిమాలు తీయగలిగే అంత మ్యాటర్ మా చేతిలో ఉంది. కనుక పుష్ప-2 తర్వాత పుష్ప-3 తీసే అవకాశం ఉంది. పుష్ప-2 పూర్తిచేసేలోగా పుష్ప-3 గురించి మాకు కూడా క్లారిటీ వస్తుంది,” అని చెప్పారు. 

పుష్ప సినిమాలో తిరుపతి కొండలపై విస్తరించి ఉన్న శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడాన్ని హైలైట్ చేసి చూపారు. వాస్తవానికి ఈ స్మగ్లింగ్ వ్యవహారంతో కొందరు ప్రముఖ రాజకీయ నాయకులకి సంబంధాలు ఉన్నట్లు పత్రికలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే పుష్పలో చూపించారు కూడా. 

ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ బిజినెస్‌కు రాజకీయాలు కూడా కలిస్తే సినిమా కధ మరింత విస్తృతమవుతుంది. పుష్ప-2లో అదే చూపించబోతున్నారు. దానిలో నుంచి పుష్ప-3 కధ అల్లుకోవడం పెద్ద కష్టం కాదు. అందుకే పుష్ప-3 ఉండొచ్చని అల్లు అర్జున్‌ అంటున్నారు.    

పుష్ప-2లో కూడా రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో బాటు కొత్తగా జగపతిబాబు కూడా పుష్ప-2లో చేరారు.  

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. 2024, ఆగస్ట్ 15వ తేదీన పుష్ప-2 విడుదల కాబోతోంది.