
సాయిధారం తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న గాంజా శంకర్ సినిమాకు తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక శాఖ హెచ్చరిక పంపింది. ఆ సినిమా టైటిల్‌లో ‘గాంజా’ పేరుని తొలగించి విడుదల చేసుకోవాలని సూచించింది. ఆ సినిమాలో యువతని మాదక ద్రవ్యాల వాడకాన్ని ప్రేరేపించే సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నా వాటినీ తొలగించుకోవాలని లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని హెచ్చరించింది.
తెలంగాణ పోలీస్ విభాగం కూడా ఇదివరకే సినీ దర్శకనిర్మాతలకు ఇటువంటి హెచ్చరికలు జారీ చేసింది. తమ సినిమాలలో మద్యం, మాదక ద్రవ్యాలు, అశ్లీల దృశ్యాలు, విపరీతమైన హింస, రక్తపాతం లేకుండా చూసుకోవాలని, వీటి వలన యువత, విద్యార్దులపై చాలా చెడు ప్రభావం పడుతోందని హెచ్చరించింది. ఇప్పుడు తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక శాఖ తొలిసారిగా లిఖితపూర్వకంగా గాంజా శంకర్ దర్శకనిర్మాతలకు హెచ్చరిక పంపింది.
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ నగరంలో గంజాయి అమ్మే వ్యక్తిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.