రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు 29వ సినిమా (ఎస్ఎస్‌ఎంబీ29) గురించి ప్రముఖ నిర్మాత, దుర్గా ఆర్ట్స్ అధినేత ఎస్.గోపాల్ రెడ్డి కొన్ని కొత్త విషయాలు చెప్పారు. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమా నిర్మాణంలో తమ సంస్థ కూడా భాగస్వామి కాబోతోందని చెప్పారు.
ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పని తుది దశలో ఉందని, బహుశః వచ్చే ఏడాది మే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవవచ్చని చెప్పారు. సుమారు 12 ఏళ్ళ క్రితమే రాజమౌళి ఓ గొప్ప దర్శకుడు అవుతారని తాను, కెఎల్ నారాయణ గుర్తించామని, ఎప్పటికైనా ఆయన దర్శకత్వంలో తమ బ్యానర్‌పై ఓ సినిమా చేయాలనుకుంటున్నామని అప్పుడే ఆయనకు చెప్పగా సరే అన్నారని గోపాల్ రెడ్డి చెప్పారు. కానీ ఆయనకున్న కమిట్‌మెంట్స్ వలన ఇన్నేళ్లు వేచి చూడాల్సివచ్చిందని గోపాల్ రెడ్డి చెప్పారు.
మహేష్ బాబుతో కూడా తమ బ్యానర్‌లో ఓ సినిమా చేయాలనుకున్నామని ఆ కోరిక కూడా ఈ సినిమాతో నెరవేరబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని గోపాల్ రెడ్డి చెప్పారు.
మహేష్ బాబు-రాజమౌళి సినిమా షూటింగ్ ప్రారంభించేందుకే మరో ఏడాది పడుతుందని గోపాల్ రెడ్డి చెప్పడం మహేష్ బాబు అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించక మానదు. ఆ తర్వాత అది పూర్తి చేయడానికి రాజమౌళి మరో 2-3 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువే సమయం తీసుకోవచ్చు. మరో నాలుగేళ్ళ వరకు అంటే 2028 వరకు మహేష్ బాబు సినిమా ఉండదన్న మాట!
వీడియో ఎన్టీవీ సౌజన్యంతో...