జీ5లో హనుమాన్‌ ఎప్పటి నుంచి అంటే...

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదలై సూపర్ హిట్ అయిన హనుమాన్‌ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. వారందరికీ ఓ శుభవార్త.

ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్న జీ5 ఓటీటీ సంస్థ మార్చి 2వ తేదీ నుంచి ఐదు భాషలలో ఒకేసారి ప్రసారం చేయబోతున్నట్లు తాజా సమాచారం.

ఈ సినిమాతో పాటు విడుదలైన రెండు పెద్ద సినిమాలు గుంటూరు కారం, సైంధవ్ కొన్ని రోజుల క్రితమే ఓటీటీలో విడుదలయ్యాయి. వాటితో పాటు హనుమాన్‌ కూడా ఓటీటీలో విడుదలకావలసి ఉన్నప్పటికీ, థియేటర్లలో ఇంకా బాగా ఆడుతున్నందున ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా వస్తోంది. 

కేవలం 45 కోట్ల బడ్జెట్‌తో తీసిన హనుమాన్‌ సినిమా సంక్రాంతి పండుగకు రెండు పెద్ద సినిమాలతో పోటీ పడి థియేటర్లలో గట్టిగా నిలబడటమే కాకుండా ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు సాధించింది. 

దీని తర్వాత దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్‌’ అనే మరో సినిమా ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ- ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి వివరాలు వెల్లడించనున్నారు.