బాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ హిందీ చిత్రం ‘దంగల్’ సినిమాలో బాలీవుడ్‌లో నటిగా నటించిన సుహానీ భట్నాగర్ (19) మృతి చెందింది. కొంతకాలం క్రితం ఆమె కాలుకి ప్రమాదం జరిగింది. దానికి ఆమె చికిత్సకు వాడిన కొన్ని మందులతో ఆమె శరీరంలో నీరు చేరింది.
ఢిల్లీ ఎయిమ్స్ (ఆస్పత్రి)లో చేరి దానికి చికిత్స తీసుకొంటుండగా ఆ మందులు వికటించి శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపించింది. ఎయిమ్స్ వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడేందుకు ఎంతగా ప్రయత్నించినా ఇన్ఫెక్షన్ శరీరంలోని ముఖ్య అవయవాలకు వ్యాపించడంతో పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం కన్ను మూసింది. ఈరోజు సాయంత్రం ఆమె స్వస్థలం హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.
ఈవిషయం తెలుసుకొని బాలీవుడ్ ప్రముఖులు, ముఖ్యంగా అమీర్ ఖాన్ తీవ్ర దిగ్బ్రాంతి చెందారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి సంతాపం, సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశారు.