మహేష్‌ బాబు-రాజమౌళి సినిమాలో విదేశీ హీరోయిన్‌?

మహేష్‌ బాబు-రాజమౌళి సినిమా ఇంకా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బహుశః మరో మూడు నాలుగు నెలల తర్వాత రెగ్యులర్ షూటింగ్‌ మొదలవవచ్చని సమాచారం. కానీ ఇది మహేష్‌ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో చేయబోతున్న సినిమా కనుక దీనికి సంబందించిన అప్‌డేట్స్ కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కనుక ఇంకా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తికాక ముందే అప్పుడే ఈ సినిమా గురించి ఊహాగానాలు మొదలైపోయాయి. ఈ సినిమాకి ‘మహరాజ్’ అనే టైటిల్‌ ఫిక్స్ చేశారని, ఈ సినిమాలో ఇండోనేషియా నటి చ్లెసియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్‌గా నటించబోతోందని, హాలీవుడ్ నటుడు క్రిస్ హెమ్స్ వర్త్ ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అలాగే ఈ సినిమాకు కెమెరా: పీఎస్ వినోద్, వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: ఆర్‌.సి. కమల్, ప్రొడక్షన్ డిజైనర్ మోహన్ బింగి, ఎడిటింగ్: తమ్మిరాజు అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు రాజమౌళి టీమ్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. 

అయితే ఈ సినిమాకి కధ అందించిన ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్, ఇది సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ, ‘ఇండియానా జోన్స్’ తరహాలో దేశవిదేశాలలో, దట్టమైన అడవులలో సాగే సాహసోపేతమైన కధ అని చెప్పారు.

ఈ సినిమాలో ఎక్కువ భాగం విదేశాలలో షూటింగ్‌ చేసే అవకాశం ఉందని చెప్పారు. కనుక ఈ సినిమా గురించి రాజమౌళి స్వయంగా చెపితే తప్ప సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ ఊహాగానాలే అని భావించాల్సి ఉంటుంది.