అక్టోబర్‌లో దేవర... మరీ ఇంత ఆలస్యమా?

కొరటాల శివ-ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సిద్దమవుతున్న దేవర సినిమా ఏప్రిల్‌ 5న విడుదల కావలసి ఉండగా ఏకంగా ఆరు నెలలు వాయిదా పడింది. దేవర అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తామని ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు.  

దేవరలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని, అయితే విలన్‌గా నటిస్తున్న బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ షూటింగ్‌లో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్నందున ఆయనతో మరికొన్ని యాక్షన్ సన్నివేశాలు తీయవలసి ఉందని దేవర బృందం చెప్పింది. ఈలోగా సినిమాలో మిగిలిన నాలుగు పాటల షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్ళి పూర్తి చేస్తామని దేవర టీమ్ చెప్పింది. 

సైఫ్ అలీ గాయపడటం, వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అవుతుండటం, ఏప్రిల్‌ నెలలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటం వంటి వివిద కారణాలతో సినిమా వాయిదా పడవచ్చని ఊహాగానాలు వినిపించాయి కానీ మరీ ఇంత ఆలస్యమవుతుందనుకోలేదు.

జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2022, మార్చి 24న రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఇంతవరకు ఇద్దరూ ఒక్క సినిమా కూడా పూర్తిచేయలేదు. రామ్ చరణ్‌ వెంటనే ‘గేమ్ చేంజర్‌’ మొదలుపెట్టినప్పటికీ ఇంతవరకు పూర్తి కాలేదు.

ఎన్టీఆర్‌ చాలా ఆలస్యంగా దేవర మొదలుపెట్టినప్పటికీ త్వరగా పూర్తి చేస్తున్నారని అభిమానులు సంతోషిస్తుంటే, ఇప్పుడు అది కూడా అక్టోబర్‌కి వెళ్లిపోయింది. రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ అభిమానులకు ఇది చాలా నిరాశ కలిగించే విషయమే. 

దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్‌, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్‌. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.     

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో దేవర సినిమాను నిర్మిస్తున్నారు.