
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు రెండో అధనపు మేజిస్ట్రేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష రూ.95.10 లక్షల జరిమానా విధించింది. ఆయన కొంత కాలం క్రితం జెట్టి వెంకటేశ్వర్లు అనే ఓ ఫైనాన్సర్ వద్ద రూ.95 లక్షలు అప్పు తీసుకున్నారు.
దానిని వాపసు చేయాలని వెంకటేశ్వర్లు ఒత్తిడి చేస్తుండటంతో బండ్ల గణేశ్ ఆయనకు రూ.95 లక్షలకు చెక్ ఇచ్చారు. కానీ ఆయన ఖాతాలో అంత సొమ్ము లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యింది.
చెక్ బౌన్స్ అయితే ఇటువంటి సమస్య ఎదుర్కోవలసి వస్తుందని బండ్ల గణేశ్‌కు తెలిసి ఉన్నప్పటికీ ఆ సమయంలో ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు చెక్ ఇచ్చి ఉండవచ్చు. కానీ చెక్ బౌన్స్ అయిన విషయం వెంకటేశ్వర్లు బండ్ల గణేశ్‌కు తెలియజేసినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. అందుకే వెంకటేశ్వర్లు కోర్టులో పిటిషన్ వేశారు. దానికి కౌంటర్ దాఖలు చేయడంలో కూడా బండ్ల గణేశ్ అలసత్వం ప్రదర్శిన్నట్లు తెలుస్తోంది.
ఒంగోలు రెండో మేజిస్ట్రేట్ కోర్టులో అదనపు మేజిస్ట్రేట్ పి.భానుసాయి దానిపై నేడు విచారణ చేపట్టి బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష. రూ.95.10 లక్షల జరిమానా విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు.
జరిమానా సొమ్ములో రూ.95 లక్షలు పిటిషనర్ వెంకటేశ్వర్లుకు చెల్లించాలని ఆదేశించారు. ఒకవేళ ఈ తీర్పుపై బండ్ల గణేశ్ హైకోర్టుకి వెళ్లదలిస్తే వెళ్ళవచ్చని చెపుతూ, ఈ తీర్పు అమలుకి నెల రోజులు గడువు విధించింది.