
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా షూటింగ్ రెండు నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టారు. దాని మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందని గీతా ఆర్ట్స్ తెలియజేసింది.
నిజజీవిత ఘటనలు ఆధారంగా ఈ సినిమా తీస్తున్నట్లు దర్శకుడు ముందే చెప్పారు. కొందరు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకని గుజరాత్ రాష్ట్రంలోని వీర్‌వల్ అనే ప్రాంతం వరకు వెళ్లినప్పుడు, అక్కడ పాకిస్తాన్ కోస్ట్ గార్డు చేతిలో చిక్కుకుంటారు. ఓ మత్స్యకారుడు ఎదుర్కొన్న చేదు అనుభవాలు, అతని కోసం ఎదురుచూసే కుటుంబం కధాంశంగా ఈ సినిమా తీస్తున్నారు.
‘తండేల్’ అనే విచిత్రమైన పేరు పెట్టడంతో ‘ఇది అసలు తెలుగు సినిమాయేనా కాదా?’ అని విలేఖరులు దర్శకుడు చందు మొండేటిని ప్రశ్నించగా గుజరాతీ భాషలో ‘తండేల్’ అంటే ‘బోట్ ఆపరేటర్’ అని వివరించారు.
సాధారణంగా చాలా మంది దర్శకనిర్మాతలు సినిమా లొకేషన్ ఫోటోలు లీక్ అవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ గీతా ఆర్ట్స్ సంస్థ స్వయంగా ఈ సినిమా లొకేషన్ ఫోటోలను సోషల్ మీడియా అభిమానులతో షేర్ చేసుకుంది. మొదటి షెడ్యూల్ శ్రీకాకుళం జిల్లాలో ఓడరేవు, అక్కడే ఉన్న మత్స్యకార గ్రామాలలో షూటింగ్ చేశారు.
నాగ చైతన్యకు 23వ సినిమాగా వస్తున్న తండేల్‌కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి నిర్మిస్తున్నారు.