
పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమన్నా జంటగా చేసిన ‘కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు’ సినిమా ఫిబ్రవరి 7న రీ-రిలీజ్ చేస్తున్నట్లు డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నేడు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ సినిమాకు రేపు సాయంత్రం 6 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
ఈ సినిమా 2012లో విడుదలైంది. కానీ మిశ్రమ స్పందన రావడంతో పెద్దగా ఆడలేదు. మరి దానిని మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమిటి?అంటే రీ-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది కదా?అని చెప్పుకోవచ్చు. కానీ అసలు కారణం, త్వరలో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతుండటమే.
ఈ ఎన్నికలలో టిడిపి, జనసేనలను దెబ్బతీయడానికి వైసీపి రాంగోపాల్ వర్మ చేత ‘వ్యూహం’, ప్రజలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసి ఓట్లు దండుకునేందుకు ‘యాత్ర-2’ వంటి సినిమాలు తీయించి రిలీజ్ చేస్తోంది. కనుక వీటికి కౌంటరుగా రాజకీయ కధాంశంతో తీసిన ‘కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు’ సినిమాని రీ-రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకోవచ్చు.
ఈ సినిమా ప్రజల ఆలోచనలు ప్రభావితం చేయలేకపోవచ్చు. కానీ ‘బ్రో’ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఒక్క సినిమా కూడా పూర్తిచేసి విడుదల చేయకపోవడంతో తీవ్ర నిరాశగా ఉన్న రెండు రాష్ట్రాలలోని పవన్ అభిమానులకు తప్పకుండా చాలా సంతోషం కలుగుతుంది.