
కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్‌లో 2015లో వచ్చిన సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు ఇప్పుడు వారి మెడకు ఉచ్చులా బిగుసుకుంటుండటం విశేషం. తన నవల ‘చచ్చేంత ప్రేమ’ను దర్శకుడు కొరటాల శివ కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశారంటూ ఆ నవలా రచయిత శరత్ చంద్ర అప్పుడే కోర్టులో కేసు వేశారు.
దానిపై నాంపల్లి కోర్టు, తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు మూడూ కూడా ఆయనకు అనుకూలంగానే తీర్పు చెప్పాయి. కొరటాల శివ కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారు కనుక క్రిమినల్ చర్యలు ఎదుర్కోవలసిందే అంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో మళ్ళీ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
దీనిపై రచయిత శరత్ చంద్ర స్పందిస్తూ, “నేను డబ్బు కోసం న్యాయపోరాటం చేయడం లేదు. డబ్బు కోసమే అయితే నేను ఆనాడే వారు ఇస్తానన్న నష్టపరిహారం తీసుకొని మౌనంగా ఉండిపోయేవాడిని. కానీ ఈ నవలతో నాకు దక్కాల్సిన పేరుని కొరటాల శివ దక్కించుకోవడం అన్యాయంగా భావించి పోరాడుతున్నాను.
ఇప్పటికైనా ఆయన నా నవలను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశానని బహిరంగంగా ఒప్పుకొని క్షమాపణలు కోరితే ఇక్కడితో ఈ పోరాటం ముగుస్తుంది. లేకుంటే శ్రీమంతుడు సినిమాలో నటించినవారిపై కూడా కేసు వేసి పోరాడుతాను,” అని హెచ్చరించారు.
దీనిపై శ్రీమంతుడు టీమ్ కూడా స్పందిస్తూ, “శ్రీమంతుడు సినిమా, దాని కధ, చచ్చేంత ప్రేమ నవల రెండూ కూడా పబ్లిక్ డోమైన్‌లోనే ఉన్నాయి. రెండూ వేర్వేరు కధలు. రెంటికీ సంబంధం లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై లీగల్ రివ్యూ జరుగుతోంది. అందువల్ల అప్పుడే ఒక అభిప్రాయానికి రావద్దని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. చట్టపరమైన ప్రక్రియపై మాకు నమ్మకం ఉంది,” అని పేర్కొంది.
ఇరు పక్షాలు చెప్తున్న ఈ మాటలను బట్టి ఎవరి వాదనలకు వారు గట్టిగా కట్టుబడి ఉన్నారని అర్దమవుతోంది. కానీ సుప్రీంకోర్టు ఈ కేసులో కొరటాల శివ క్రిమినల్ చర్యలు ఎదుర్కోవలసిందే అని తేల్చి చెప్పిన తర్వాత ఇంకా న్యాయ ప్రక్రియపై మాకు నమ్మకం ఉందంటూ శ్రీమంతుడు టీమ్ చెప్పడమే ఆశ్చర్యం కలిగిస్తోంది.