మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మారేడుమిల్లి అడవులలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ముందే ప్రకటించారు.
ఈ సినిమా తర్వాత రామ్ చరణ్‌తో కూడా వశిష్ట ఓ సినిమా చేయబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటిపై దర్శకుడు వశిష్ట స్పందిస్తూ, ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాను. కనుక నా దృష్టి అంతా ఈ సినిమాపైనే ఉంది. తర్వాత ఎవరితో చేయాలో ఇంకా అనుకోలేదు. కనుక రామ్ చరణ్‌తో నేను సినిమా చేయబోతున్నట్లు మీడియాలో వస్తున్నవన్నీ కేవలం పుకార్లే,” అని చెప్పేశారు.
ఈ సినిమాను గత ఏడాది దసరా పండుగ రోజున పాటల రికార్డింగ్ కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభించారు. దీనిలో ఆరు పాటలుంటాయని సంగీతం సమకూరుస్తున్న ఎంఎం కీరవాణి తెలిపారు.
సోషియో ఫాంటసీ జోనర్‌లో తీస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా మృణాళిని ఠాకూర్ నటించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.