ఏప్రిల్‌ 5నే దేవర... వాయిదాల్లేవ్!

కొరటాల శివ-ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సిద్దమవుతున్న దేవర సినిమా ఏప్రిల్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే వీఎఫ్ఎక్స్ పనులలో ఆలస్యమవుతున్నందున ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తుండటంతో, ఒకవేళ దేవర నిజంగా వాయిదా పడితే విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘ఫ్యామిలీ స్టార్' మార్చి 28 లేదా 30కి రిలీజ్ చేసుకోవాలని దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు  చిన్న సందేశం పెట్టారు.    

దీనిపై దేవర టీమ్ స్పందిస్తూ, “అభిమానులకు దేవర మాట ఇచ్చాడు. కనుక ఏప్రిల్‌ 5నే వస్తున్నాడు. వీఎఫ్ఎక్స్ పనులలో ఎటువంటి ఆలస్యం జరగడం లేదు. కనుక సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నమ్మవద్దు,” అంటూ స్పష్టత ఇచ్చింది.

కానీ ఒకవేళ అదే సమయంలో ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నట్లయితే దేవర ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవచ్చు. 

అలనాటి అందాల నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా నటిస్తోంది. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్‌, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్‌. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.     

రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి దేవర సినిమాను నిర్మిస్తున్నారు. 

కొన్ని రోజుల క్రితం విడుదలైన దేవర ఫస్ట్ గ్లిమ్స్‌, దానిలో “ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని, నెత్తురినే ఎక్కువ చూసుంటాది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు,” అంటూ జూ.ఎన్టీఆర్‌ గంభీరమైన గొంతుతో చెప్పే డైలాగ్‌ దేవరపై అంచనాలు పెంచేశాయి. 

కనుక ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ఈ సినిమా రైట్స్ దక్కించుకునేందుకు మైత్రీ మూవీస్ సంస్థ గట్టిగా ప్రయత్నిస్తోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న దేవరకు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ రూ.155 కోట్లు చెల్లించి హక్కులు కొనుగోలు చేసిన్నట్లు తెలుస్తోంది.