
శ్రీరాముడి నమ్మిన బంటు హనుమంతులవారు. కనుకనే ఆదిపురుష్ కొరకు హనుమాన్ వెనక్కు తగ్గాడు. ఇప్పుడు రామయ్య మీద భక్తిగా కానుకలు సమర్పించుకుంటున్నాడు. హనుమాన్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లోనే ఈ సినిమా ప్రతీ టికెట్‌పై రూ.5 అయోధ్య రామ మందిరానికి విరాళంగా అందిస్తామని దర్శకనిర్మాతలు ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా నేటి వరకు 53,28,211 టికెట్లు అమ్ముడుపోగా వాటి ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.2,66,41,055 అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రకటించారు.
చిన్న సినిమాగా సంక్రాంతికి విడుదలైన హనుమాన్ ‘గుంటూరు కారం’ వంటి పెద్ద సినిమాలతో పోటీ పడి నిలబడటమే కాకుండా నేటికీ భారీగా కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఇప్పటికే వంద కోట్లు దాటేసి రూ.150 కోట్లు సాధించేందుకు హనుమాన్ దూసుకుపోతున్నాడు.
హనుమాన్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లోనే ఈ సినిమా చాలా రోజులు థియేటర్లలో ప్రదర్శింపబడుతుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా నమ్మకంగా చెప్పారు. వారు చెప్పిన్నట్లే జరుగుతోంది. వారిపై సర్వత్రా ప్రశంశలు కురుస్తూనే ఉన్నాయి.
అయోధ్య రామ మందిరంలో రామయ్య విగ్రహానికి రేపు ప్రాణప్రతిష్ట జరుగుతున్నప్పుడు రామభక్త హనుమాన్ రెండున్నర కోట్లు కానుక సమర్పించుకోవడాన్ని అందరూ ప్రశంశిస్తున్నారు.