నెట్‌ఫ్లిక్స్‌లో సలార్‌: ఎప్పటి నుంచి అంటే...

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌, పృధ్వీరాజ్ సుకుమారన్, శ్రుతీహాసన్ ప్రధాన పాత్రలలో డిసెంబర్‌ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అప్పటి నుంచి బాక్సాఫీస్ బద్దలు కొడుతూ రికార్డ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతూనే ఉంది. ఇప్పటి వరకు రూ.700 కోట్లు కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు కనకవర్షం కురిపిస్తోంది. 

ప్రభాస్‌ కెరీర్‌లో ఈ సినిమా మరో మైలు రాయిగా నిలిచింది. రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో తీవ్ర నిరాశ చెందిన ప్రభాస్‌ అభిమానులు సలార్‌ సూపర్ హిట్ అవడంతో చాలా సంతోషంగా ఉన్నారు. కనుక ఈ సూపర్ హిట్ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

వారి నిరీక్షణకు ముగింపు పలుకుతూ రేపు (శనివారం) నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో సలార్‌ ప్రసారం కాబోతోంది. ఈ విషయం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. 

సలార్‌-1 సీజ్ ఫైర్ సినిమా తీస్తున్నప్పుడే దీనికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పారు. అది సలార్‌ మొదటి భాగానికి మించి ఉంటుందని, అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్పారు. 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న కల్కి ఎడి 2898, ఈ ఏడాది మే 9వ తేదీన విడుదల కాబోతోంది. మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘ది రాజా సాబ్’ ఎప్పుడు విడుదల చేయబోతున్నారో ఇంకా ప్రకటించలేదు. 

హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాకి ప్రభాస్‌ ఒకే చెప్పేశారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత దీనిని మొదలుపెట్టనున్నారు.  

మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప సినిమాలో ప్రభాస్‌ శివుడి పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే.