సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబినేషన్లో ఊరు పేరు ‘భైరవకోన’ ఫిబ్రవరి 9వ తేదీన విడుదల కాబోతోంది. అయితే అదే రోజున రవితేజ నటించిన ‘ఈగల్’ సినిమా కూడా విడుదల కాబోతోంది. నిజానికి ఈ రెండు సినిమాలతో పాటు సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘టిల్లూ స్క్వేర్’ కూడా సంక్రాంతి పండుగకు విడుదల కావలసి ఉంది. కానీ అప్పటికే నాలుగు సినిమాలు విడుదలవుతున్నందున ఈ మూడు సినిమాలు ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాయి.
సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్నందుకు ఈగల్‌కు మరో సినిమా నుంచి పోటీ లేకుండా చూస్తామని నిర్మాతల మండలి హామీ ఇచ్చింది. కానీ ఫిబ్రవరి 9వ తేదీనే ‘ఊరు పేరూ భైరవకోన’, ‘టిల్లూ స్క్వేర్’, ‘ఈగల్’ మూడూ సినిమాలు విడుదలవుతున్నాయి. కనుక మళ్ళీ వాటి మద్య పోటీ ఏర్పడింది.
అయితే ఈసారి తాము వెనక్కు తగ్గబోమని సందీప్ కిషన్, విఐ ఆనంద్ ఇద్దరూ చెప్పేశారు. తాము ముందుగానే ‘టిల్లూ స్క్వేర్’ దర్శకనిర్మాతలతో మాట్లాడుకుని ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నామని చెప్పారు. అలాగే ‘ఈగల్’ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కానీ సినిమా వాయిదా వేసుకోవాలని వారి నుంచి తమకు ఎటువంటి ఫోన్లు రాలేదని చెప్పారు. ఫిబ్రవరి 9న మూడు సినిమాలు రిలీజ్ అయినా ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని సందీప్ కిషన్ చెప్పారు.