హనుమాన్‌ దర్శకుడికి బాలకృష్ణ ప్రశంశలు

సంక్రాంతి పండుగకు భారీ అంచనాలతో వచ్చిన చిన్న సినిమా హనుమాన్‌ సూపర్ హిట్ అయ్యింది. సినిమా బాగుండటంతో ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ కనకవర్షం కురుస్తోంది.హనుమాన్‌ సినిమా చాలా బాగుందనే మౌత్ టాక్‌తో హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో రోజు రోజుకీ హనుమాన్‌కు థియేటర్లు పెంచాల్సి వస్తోంది. 

గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగా వంటి మూడు పెద్ద సినిమాలు హనుమాన్‌ ధాటికి విలవిలలాడుతున్నాయి. 

ఈ నేపధ్యంలో నందమూరి బాలకృష్ణ ప్రత్యేకంగా స్పెషల్ షో వేయించుకుని కుటుంబ సమేతంగా హనుమాన్‌ సినిమాని ఆస్వాదించారు. అనంతరం దర్శకుడు ప్రశాంత్ వర్మపై ప్రశంశల వర్షం కురిపించారు.

హనుమాన్‌లో చాలా కంటెంట్ ఉందని, సినిమాని అద్భుతంగా తెరకెక్కించారని, ముఖ్యంగా ప్రశాంత్ వర్మ టేకింగ్, విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ, సంగీతం, పాటలు అన్నీ చాలా బాగున్నాయని ప్రశంశించారు. సినిమాలో నటీనటులందరూ చాలా చక్కగా నటించారని బాలకృష్ణ మెచ్చుకున్నారు.  

చిన్న సినిమా అయినా ఎక్కడా రాజీ పడకుండా రెండేళ్ళు కష్టపడటం చాలా అభినందనీయమని అన్నారు. ప్రశాంత్ వర్మపై ఇంత నమ్మకం ఉంచినందుకు నిర్మాత నిరంజన్ రెడ్డిని కూడా బాలకృష్ణ అభినందించారు.

సినిమాపై ప్రశాంత్ వర్మ టీమ్‌కున్న అపార నమ్మకం చాలా ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. వారి నమ్మకం, హనుమంతుడు, శ్రీరాముడు ఆశీసులతో సినిమా హిట్ అయ్యిందని బాలకృష్ణ అన్నారు.