
మారుతి-ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా మంచి కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తూనే ఉంది. ప్రభాస్ కామెడీ చేసి చాలా కాలమే అయ్యింది కనుక అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
అయితే ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ రెండూ పెద్ద బడ్జెట్ సినిమాలు కావడంతో ది రాజాసాబ్ సినిమాకు సంబందించి ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వకుండా నిశబ్ధంగా సినిమా షూటింగ్ చేస్తున్నారు.
ఆ రెండు పెద్ద సినిమాలు విడుదలైపోయాయి కనుక మొన్న సంక్రాంతి పండుగకు ది రాజాసాబ్ టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ రెండూ ప్రకటించారు. అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
దీంతో ప్రముఖ మూవీ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండిబి) ఈ సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ తమ వెబ్‌సైట్‌లో పెట్టింది. ఇద్దరు ప్రేమపక్షులు దుష్టశక్తులను ఎదుర్కొంటూ చేసిన పోరాటాలే ది రాజాసాబ్ స్టోరీ లైన్ అని పేర్కొంది.
ఈవిషయం దర్శకుడు మారుతి దృష్టికి రావడంతో ఆయన స్పందిస్తూ, “అరెరే నాకు ఈ స్టోరీలైన్ గురించి తెలియక మరో స్క్రిప్ట్ తో సినిమా తీస్తున్నాను. ఇప్పుడు ఐఎండిబి సమాజం నా స్క్రిప్ట్ ని అంగీకరిస్తుందో లేదో,” అంటూ సరదాగా జవాబిచ్చారు. అది చూసి నెటిజన్స్ హాయిగా నవ్వుకున్నారు.