
ప్రభాస్-మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అప్‌డేట్స్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈరోజు సంక్రాంతి పండుగకు డబుల్ ట్రీట్ ఇస్తామని దర్శకుడు మారుతి మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారమే ఈరోజు ఉదయం 7.08 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ రెండూ ప్రకటించేశారు.
ప్రభాస్-మారుతి సినిమా టైటిల్ ‘ది రాజా సాబ్’ అని సోషల్ మీడియాలో ప్రకటించారు. చాలా ఏళ్లుగా ప్రభాస్ సీరియస్ రోల్స్ చేస్తుండటంతో తమ హీరోని భిన్నంగా చూడాలనుకుంటున్న అభిమానులు కేరింతలు కొట్టేలా ఉంది ఫస్ట్-లుక్ పోస్టర్. దానిలో ప్రభాస్ రెండు చేతులతో లుంగీ కట్టుకొని చిలిపిగా చూస్తున్న పోజ్ ఇచ్చాడు. సంక్రాంతి పండుగ రోజున ఇటు వంటి మాస్ టైటిల్, మాస్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానులకు దర్శకుడు మారుతి చాలా మంచి పండుగ బహుమతి ఇచ్చారు.
ఫస్ట్-లుక్ పోస్టర్‌లో సినిమా సంగీత దర్శకుడు: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అని చెప్పేశారు.
కానీ ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల పేర్లు ఇంకా బయటపెట్టలేదు. హీరోయిన్‌గా మాళవిక మోహనన్, బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబందించి అప్‌డేట్స్ ఇస్తుంటామని మారుతి ముందే మాట ఇచ్చారు. కనుక త్వరలోనే ది రాజా సాబ్ గురించి మరిన్ని విశేషాలు తెలుస్తాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి చాలా కాలమే అయ్యింది కనుక ఈ ఏడాది వేసవి సెలవులలో లేదా దసరా, దీపావళి పండుగల సీజన్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.