
హనుమాన్ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఏడాదిన్నర క్రితమే డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు చేసుకొని జనవరి 12నుంచి తమ సినిమాని ప్రదర్శించేందుకు థియేటర్లు బుక్ చేసుకుంది.
అయితే అదే రోజున మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా కూడా రిలీజ్ అవడం, దానికి ఎక్కువ డిమాండ్ ఉండటంతో తెలంగాణలో కొన్ని థియేటర్ల యజమానులు హనుమాన్ సినిమాకి థియేటర్లు ఇవ్వకుండా గుంటూరు కారం సినిమా వేసుకుంటున్నారు.
దీనిపై హనుమాన్ సినీ నిర్మాత నిరంజన్ రెడ్డి, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగు చలన చిత్ర మండలి (టిఎఫ్‌పిసి)కి ఫిర్యాదు చేసారు. వారి పిర్యాదుపై టిఎఫ్‌పిసి వెంటనే స్పందిస్తూ, “హనుమాన్ సినిమా ప్రదర్శనకు ఆ సినీ నిర్మాత, సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని థియేటర్ యజమానులు గౌరవించాలి.
తక్షణమే హనుమాన్ సినిమాని థియేటర్లలో వేయాలి. అలాగే రెండు రోజులు వేయకుండా పక్కన పెట్టి వేరే సినిమా వేసుకున్నందుకు హనుమాన్ సినీ నిర్మాతకు జరిగిన నష్టాన్ని కూడా వారే భరించాలి.
సినిమాల డిస్ట్రిబ్యూషన్, ప్రదర్శన కోసం చేసుకున్న ఒప్పందాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సినీ పరిశ్రమ నష్టపోతుందని అందరూ గ్రహించాలి,” అంటూ ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేయడమే కాకుండా సదరు థియేటర్ల యజమానులకు టిఎఫ్‌పిసి ప్రతినిధులు ఫోన్ చేసి హెచ్చరించారు.
అయితే గుంటూరు కారం సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం, హనుమాన్‌కి మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఇప్పుడు థియేటర్ల యజమానులే హనుమాన్ కోసం పోటీ పడుతున్నారు.