
త్వరలో జరుగబోయే ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో అధికార వైసీపీకి లబ్ధి కలిగిస్తూ, దాని రాజకీయ ప్రత్యర్దులైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వారి టిడిపి, జనసేనలను రాజకీయంగా అప్రదిష్టపాలు చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ చేత వైసీపి వ్యూహం అనే సినిమా తీయించింది.
అది డిసెంబర్‌లో విడుదల కావలసి ఉండగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు సినిమాని రిలీజ్ చేయద్దని స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో వర్మ, వైసీపిల వ్యూహం బెడిసికొట్టింది.
అయితే దీనిని ఓటీటీ, వెబ్‌సైట్, మొబైల్ యాప్స్ ద్వారా విడుదల చేసే అవకాశం ఉన్నందున ఆ విదంగా కూడా విడుదల చేయకుండా నిలిపివేయాలని నారా లోకేష్ హైకోర్టుని అభ్యర్ధించారు. దానిపై కూడా సానుకూలంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు వ్యూహం సినిమాను ఏవిదంగానూ విడుదల చేయకూడదని మళ్ళీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సినిమాలో జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, సోనియా గాంధీ తదితరులు రాజకీయ కుట్రలు చేశారన్నట్లు చూపారు. సినిమాలో వారి పాత్రలు చేసిన నటీనటులు అచ్చం వారిలా ఉండేవారినే రాంగోపాల్ వర్మ ప్రత్యేకంగా ఏరికోరి తెచ్చుకుని వారితో ఈ సినిమా తీశారు.
కానీ హైకోర్టు స్టే విధించడంతో ఈ సినిమా సంక్రాంతి పండుగ సీజన్‌లో కాదు కదా... కనీసం ఏపీ శాసనసభ ఎన్నికలలోగా కూడా వ్యూహం విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
ఎదుటవాళ్ళు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపి తమ రాజకీయ ప్రత్యర్దులను దెబ్బ తీయడానికి సినిమా పేరుతో ఈవిదంగా కుట్రలు చేస్తుండటాన్ని ఏమనుకోవాలి?