
ప్రభాస్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్-1 సీజ్ ఫైర్ సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు అందరూ ప్రభాస్ తర్వాత సినిమా కల్కి ఎడి-2898 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నేడు (జనవరి 12)న విడుదల కావలసి ఉంది. కానీ మే 9వ తేదీన విడుదల చేయబోతున్నట్లు వైజయంతీ మూవీస్ ఇవ్వళ్ళే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
అంటే మరో 5 నెలల తర్వాతే కల్కి రాబోతున్నాడన్న మాట! ఈ వార్త అభిమానులకు చాలా నిరుత్సాహం కలిగిస్తుంది. కానీ ఆలోగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న సినిమా వస్తుందేమో చూడాలి. తమ సినిమా గురించి సంక్రాంతి పండుగకు అప్డేట్ ఇస్తామని మారుతి స్వయంగా చెప్పారు.
ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అని పేరు పెట్టిన్నట్లు వార్తలు వస్తున్నా మారుతి వాటిని ధృవీకరించలేదు. కనుక ఈ రెండు మూడు రోజులలో ఈ సినిమా పేరు, ఫస్ట్ గ్లిమ్స్ విడుదలయ్యే అవకాశం ఉంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొనే, దిశా పటానీ వంటి అగ్రనటీనటులతో తెరకెక్కుతున్న కల్కి ఎడి 2898 సినిమాని సుమారు రూ.600 కోట్ల బారీ బడ్జెట్తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మిస్తోంది.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్డ్జీ స్టోజిల్జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.