త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మంగళవారం గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమం హైదరాబాద్, యూసఫ్ గూడలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ, అక్కడ పోలీస్ బందోబస్తు కష్టమని చెపుతూ అనుమతి నిరాకరించడంతో ఈ కార్యక్రమాన్ని గుంటూరుకి షిఫ్ట్ చేసి అక్కడ అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, “మా గుంటూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు మా దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా నిర్మాత ఎస్. రాధాకృష్ణకు నేనే అభిమాన హీరోని. ఆయన కళ్ళలో సంతోషం చూసినప్పుడు, నాకూ చాలా సంతోషం కలుగుతుంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన నాకు మంచి స్నేహితుడు, మా కుటుంబంలో ఒకరిగా భావిస్తుంటాను. ఈ రెండేళ్ళలో ఆయనతో పనిచేయడం నాకు ఎంతో సంతోషం కలిగించింది,” అని అన్నారు.
శ్రీలీల గురించి చెపుతూ, “మళ్ళీ ఇంతకాలానికి నా సినిమాలో హీరోయిన్‌గా మన తెలుగమ్మాయి సెట్ అవడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. ఆ అమ్మాయితో పోటీ పడి డ్యాన్స్ చేయడం చాలా కష్టమే. తమన్ నా తమ్ముడు వంటివాడు. నాకు ఫలానా విదంగా పాటకావాలని చెపితే వెంటనే చేసి ఇచ్చేస్తాడు. కుర్చీ మడత పెట్టి... అలాగే ఇచ్చాడు. ఈ పాటతో థియేటర్లు దద్దరిల్లిపోతాయి,” అని అన్నారు.