విజయ్‌ దేవరకొండ, రష్మికల పెళ్ళి... వట్టి పుకార్లే!

సినీ పరిశ్రమలో ఉన్నవారు, ముఖ్యంగా సినిమాలలో కలిసి నటించినవారు ప్రేమించుకోవడం, పెళ్ళి చేసుకోవడం సాధారణ విషయమే. అయితే ఇద్దరూ రెండు మూడు సినిమాలలో కలిసి నటిస్తే చాలు... సోషల్ మీడియా పెళ్ళి పెద్దగా మారి వారి పెళ్ళిళ్ళు చేసేస్తుంటుంది.

అలాగే విజయ్‌ దేవరకొండ, రష్మిక మందనలకు పెళ్ళి చేసేందుకు సిద్దమైపోయింది. వారిద్దరికీ ఫిబ్రవరిలో వివాహ నిశ్చితార్ధం జరుగబోతోందని సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. 

విజయ్‌ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన గీతా గోవిందంలో వారి మద్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదరడంతో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వారిద్దరూ డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించారు. అప్పటి నుంచే వారి మద్య బలమైన స్నేహం ఏర్పడింది.

అది ప్రేమగా మారిందన్నట్లు వారి మాటలు, ట్వీట్స్ సూచిస్తుండటంతో సోషల్ మీడియాలో కొందరు చొరవ తీసుకుని వారికి ఫిబ్రవరిలో నిశ్చితార్ధం చేసేశారు. ఇది జాతీయ మీడియా వరకు పాకిపోయింది కూడా. దీంతో విజయ్‌ దేవరకొండ టీమ్ మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ కేవలం పుకార్లే అని, వారిద్దరూ మంచి స్నేహితులే తప్ప వారికి పెళ్ళి చేసుకొనే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది.