
కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి జంటగా చేస్తున్న ‘దేవర’ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ సోమవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల కాబోతోంది. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయిన తర్వాత దీనిని ఒక్క భాగంలో తీయడం కష్టమని కనుక రెండు భాగాలలో తీయక తప్పదని కొరటాల శివ బాంబు పేల్చారు. ఇది ఎన్టీఆర్ అభిమానుల కాస్త సంతోషం, కాస్త ఆందోళన కలిగిస్తోంది. మొదటి భాగం హిట్ అయితే పర్వాలేదు. కాకపోతే రెండో భాగం పరిస్థితి ఏమిటి? అని ఆందోళన చెందుతున్నారు.
ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతోంది. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.
రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి దేవర సినిమాను నిర్మిస్తున్నారు.