
త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి నేటి వరకు ఏవో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్, యూసఫ్ గూడా, పోలీస్ లైన్స్ వద్ద మైదానంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోగా, పోలీసులు అనుమతి నిరాకరించారు. అక్కడ ఆ ఈవెంట్‌కు పోలీస్ బందోబస్తు కల్పించడం సాధ్యం కాదని కనుక అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.
దీంతో నేడు జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా వేస్తున్నట్లు గుంటూరు కారం టీమ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. అనివార్య కారణాలు, భద్రతా ఏర్పాట్ల కారణంగా ఈరోజు జరగాల్సిన గుంటూరు కారం ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దు చేశామని, ఇందుకు అభిమానులకు క్షమాపణ తెలుపుకొంటూ త్వరలోనే తేదీ, వేదికని తెలియజేస్తామని ఓ లేఖ పెట్టింది.
గుంటూరు కారం సినిమా మహేష్ బాబుకి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇంకా ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ, జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేసారు.
ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: నవీన్ నూలి చేసారు. ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. గుంటూరు కారం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతోంది.