దేశవ్యాప్తంగా హనుమాన్ ప్రమోషన్స్ నేటి నుంచే….

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటించిన ‘హనుమాన్’ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దీనిని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో యావత్ భారతదేశంలో విడుదల చేయబోతున్నందున హనుమాన్ ప్రమోషన్స్ కోసం హనుమాన్ టీమ్ నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో పర్యటించబోతున్నారు.

ముందుగా నేడు కేరళలోని కొచ్చి నగరంలో ప్రమోషన్స్ నిర్వహించనున్నారు. జనవరి 5న చెన్నై, 6న బెంగళూరు,7న హైదరాబాద్‌, 8న ముంబాయి, 9న ఢిల్లీలో ప్రమోషన్స్ నిర్వహించనున్నారు. తిరిగి వచ్చిన తర్వాత బహుశః హైదరాబాద్‌ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. 

హనుమాన్‌లో వరలక్ష్మి శరత్ కుమార్‌, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి ముఖ్యపాత్రలు చేసారు. 

ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ సౌరభ్, కెమెరా: దాశరధి శివేంద్ర అందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్, జపనీస్, కొరియన్, చైనీస్, స్పానిష్ భాషలలో కూడా విడుదల చేయబోతున్నారు.