హనుమాన్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ముఖ్యఅతిధిగా చిరంజీవి?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటించిన ‘హనుమాన్’ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12న విడుదల కాబోతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిధిగా ఆహ్వానించిన్నట్లు తెలుస్తోంది. నేడో రేపో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ తేదీ, వేదిక, ముఖ్య అతిధి గురించి హనుమాన్ టీమ్ ప్రకటించనుంది. 

హనుమాన్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవే ఎందుకు? అంటే ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా ఇంద్రలో తేజా సజ్జా చిరంజీవి చిన్నప్పటి పాత్ర చేశాడు కనుక! ఆ సెంటిమెంట్‌తో ఇప్పుడు చిరంజీవిని ఆహ్వానించిన్నట్లు తెలుస్తోంది. 

హనుమాన్ సినిమాకి సెన్సార్ బోర్డ్ యు/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. హనుమాన్ సినిమాని మొదట చిన్న బడ్జెట్‌తోనే మొదలుపెట్టినప్పటికీ అన్ని రాష్ట్రాలు, దేశాల ప్రజలు కనెక్ట్ కాగల కథాంశం ఉన్నందున, టీజర్‌, ట్రైలర్‌లకు మంచి స్పందన వచ్చినందున, ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠి భాషలతో పాటు చైనీస్, స్పానిష్, కొరియన్, జపనీస్ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.

ఈసారి సంక్రాంతికి మహేష్‌ బాబు నటించిన ‘గుంటూరు కారం’, నాగార్జున నటించిన ‘నా సామిరంగా’, రవితేజ నటించిన ‘ఈగల్’, వెంకటేష్ నటించిన ‘సైంధవ్’ సినిమాలు విడుదలవుతున్నాయి. వాటితో సూపర్ పవర్స్ కలిగిన హనుమాన్ పోటీ పడబోతోంది. మరి వాటి ధాటికి తట్టుకొని నిలబడి పోటీ పడుతుందా లేక వాటికే గట్టి పోటీ ఇస్తుందా? అనేది సంక్రాంతికల్లా తెలిసిపోతుంది.