
కొరటాల శివ దర్శకత్వంలో జూ. ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా చేస్తున్న దేవర సినిమా ఏప్రిల్ 5వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ మిస్ చేసుకున్నందున పండుగకు ముందు అంటే జనవరి 8న దేవర టీజర్ రిలీజ్ చేయాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు.
ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
“దేవర సినిమా కధ 1990లో సాగుతుంది కనుక అందుకు అనుగుణంగానే ప్రత్యేకమైన సెట్స్ వేసి తీశాము. ముఖ్యంగా నీటిలో 30 అడుగుల లోతులో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు భారతీయ సినీ అభిమానులకు కొత్త అనుభూతిని అందిస్తాయి. ఈ అండర్ వాటర్ సన్నివేశాలను చిత్రీకరించడానికే మాకు 8 నెలలు సమయం పట్టింది.
సినీ నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా మంచి టెక్నీషియన్స్‌తో తీస్తున్నాము. హాలీవుడ్ సినిమా ‘గేమ్ ఆఫ్ ధ్రోన్స్’ను మించి దేవర ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ నెల 8న విడుదల కాబోతున్న టీజర్, దేవర సినిమా ఏ స్థాయిలో ఉంటుందో తెలియజేయబోతోంది,” అని కళ్యాణ్ రామ్ అన్నారు.
దేవర రెండు భాగాలుగా తీస్తామని కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూ.ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి జంటగా చేస్తున్న దేవర సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.