తేజా సజ్జా తర్వత చిత్రంలో కూడా సూపర్ హీరోయే!

యువనటుడు తేజా సజ్జా, యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తీసిన ‘హనుమాన్’ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 12న విడుదల కాబోతున్న సంగతి దానిలో తేజా సజ్జా హనుమంతుడి శక్తులు పొందిన ‘సూపర్ మ్యాన్’గా నటిస్తున్న సంగతి తెలిసిందే.  

దీని తర్వాత తేజా సజ్జా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా తేజా సజ్జా ‘సూపర్ మ్యాన్’గానే నటిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే వీరిద్దరూ సినిమా షూటింగ్‌ కూడా మొదలుపెట్టి కొంత పూర్తి చేశారు. 

అయితే మద్యలో కార్తీక్ ఘట్టమనేనికి రవితేజతో ఈగల్ సినిమా అవకాశం రాగా, తేజా సజ్జా హనుమాన్ సినిమాతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఇద్దరూ తమ సినిమాలను పూర్తి చేశారు. రెండూ సంక్రాంతికే విడుదల కాబోతున్నాయి.

కనుక అవి విడుదలైన తర్వాత సగంలో ఆపేసిన ఆ సినిమాని ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. 

హనుమాన్ సినిమాలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్‌, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి ముఖ్యపాత్రలు చేసారు. 

ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ సౌరభ్, కెమెరా: దాశరధి శివేంద్ర అందించారు. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం , హిందీ, మరాఠీ భాషలతో పాటు ఇంగ్లీష్, జపనీస్, కొరియన్, చైనీస్, స్పానిష్ భాషలలోను విడుదల చేయబోతున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.   

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తీసిన ఈగల్ సినిమాలో రవితేజకు హీరోయిన్లుగా కావ్యా థాపర్, అనుపమ పరమేశ్వరన్ నటించారు. దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. ఈగల్ సినిమా కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విడుదల కాబోతోంది.