
తెలుగు సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున దంపతులు, నందమూరి బాలకృష్ణ, చిన్నల్లుడు భరత్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తదితరులున్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు వంటిదే అయినప్పట్టికీ అక్కడి జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమలో వారికి టిడిపి, జనసేనలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉండటంతో వారినీ శత్రువులుగానే పరిగణిస్తూ వేదిస్తోంది.
కొన్ని నెలల క్రితం చిరంజీవి నేతృత్వంలో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలందరూ కలిసి తాడేపల్లిలోని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళి చేతులు జోడించి సినీ పరిశ్రమకు సహకరించవలసిందిగా వేడుకొన్నారు కూడా.
సినీ పరిశ్రమ ఏపీకి తరలి వస్తే ప్రభుత్వం తరపు సహాయ సహకారాలు అందిస్తామని జగన్మోహన్ రెడ్డి వారికి చెప్పారు. కానీ జగన్ ప్రభుత్వం తీరు చూసి ఏపీకి వెళ్ళేందుకు హడలిపోతున్న సినీ పరిశ్రమ హైదరాబాద్లోనే ఉంటోంది.
కేసీఆర్ ప్రభుత్వం సినీ పరిశ్రమని చాలా ఆదరించి అవసరమైన సహాయ సహకారాలు అందించింది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కనుక అదేవిదమైన సహాయ సహకారాలు ఆశిస్తూ సినీ పెద్దలు సిఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారనుకోవచ్చు.
రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సినీ పెద్దలు కలిసినప్పుడు సినీ పరిశ్రమని తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రముఖ నటుడు మురళీ మోహన్ అభ్యర్ధన మేరకు మార్చిలో ఉగాది రోజున మళ్ళీ నందీ అవార్డుల ప్రదానోత్సవం కూడా నిర్వహిస్తామని మాటిచ్చారు.