వర్మ వ్యూహం సినిమాపై హైకోర్టు స్టే

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తీసిన వ్యూహం సినిమా ఈరోజు విడుదల కావలసి ఉండగా, హైకోర్టు దానికి బ్రేక్ వేసి జనవరి 11 వరకు విడుదల చేయవద్దని ఆదేశించింది.

2024 మార్చి-ఏప్రిల్ నెలల్లో  ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్న నేపధ్యంలో వాటిలో టిడిపిని దెబ్బ తీసేందుకు వైసీపికి చెందిన దాసరి కిరణ్ ఈ సినిమాని రాంగోపాల్ వర్మ చేత తీయించారు.  

జగన్‌ రాజకీయ ప్రస్థానంలో ఏపీ సిఎంగా ఎదిగే క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టిడిపి నేత నారా లోకేష్‌తో సహా పలువురు ఏవిదంగా కుట్రలు, కుతంత్రాలు చేసి అడ్డుకొనే ప్రయత్నం చేశారో చూపారు. 

తద్వారా వారందరినీ ఏపీ ప్రజల ముందు దోషులుగా చూపుతూ టిడిపి, జనసేనలను ఎన్నికలలో దెబ్బతీయాలనే రాజకీయ వ్యూహంతోనే ఈ వ్యూహం సినిమా నిర్మింపజేశారు. 

ఊహించిన్నట్లే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నారా లోకేష్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దానిపై గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు విచారణ సాగింది. ఇరుపక్షాలు సుదీర్గ వాదనలు విన్న తర్వాత జస్టిస్ ఎస్.నంద రాత్రి 11.30 గంటలకు ఈ సినిమా విడుదలపై జనవరి 11వరకు స్టే విధిస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.