కోలీవుడ్‌ నటుడు విజయకాంత్ మృతి

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు విజయకాంత్ (71) ఈరోజు ఉదయం చెన్నైలోని మియోట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇటీవల కరోనా సోకడంతో జలుబు, జ్వరం లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆయన కోలుకొని తిరిగి వస్తారనుకొంటే ఈరోజు ఉదయం పరిస్థితి విషమించి కన్నుమూశారు. 

విజయకాంత్ కూడా డిఎండికె పార్టీని స్థాపించి తమిళ రాజకీయాలలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు కానీ ఆయన పార్టీ ఎన్నడూ అధికారంలోకి రాలేకపోయింది. 

విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. 27 ఏళ్ల వయసులో కోలీవుడ్‌లో అడుగుపెట్టి 150కి పైగా సినిమాలు చేశారు. ఒక్క 1984వ సంవత్సరంలోనే ఆయన ఏకంగా 18 సినిమాలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. పోలీస్ అధికారిగా 20 సినిమాలలో నటించి మరో రికార్డు నెలకొల్పారు. విజయకాంత్ తమిళంలో తప్ప మరే ఇతర భాషా చిత్రాలలో నటించలేదు. కానీ అయన నటించిన తమిళ చిత్రాలు తెలుగు, హిందీతో సహా పలు భాషల్లో డబ్బింగ్ చేసి విడుదలవుతుండేవి.  

వాటిలో అనేక సూపర్ హిట్ సినిమాలు ఆయనకు మంచి పేరు, అభిమానులను సంపాదించి పెట్టాయి. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్ సూపర్ హిట్ అవడంతో అప్పటి నుంచి ఆయనకు ‘కెప్టెన్ విజయకాంత్’ అయ్యారు. 

విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు షణ్ముఖ పాండియన్ కూడా తమిళ సినిమాలలో నటిస్తున్నారు.  

విజయకాంత్ మృతి పట్ల కోలీవుడ్‌, తమిళనాట రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.