అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఫిబ్రవరి 2న రిలీజ్

తెలుగు సినీ పరిశ్రమలో ఓ వైపు వందల కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రాలు, అంతర్జాతీయ స్థాయి కధలతో సినిమాలు వస్తుంటే, మరోవైపు అచ్చమైన ఆంధ్రా, తెలంగాణ మాండలీకలతో చక్కటి చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రభాస్‌ తాజా చిత్రం సలార్, వేణు ఎల్డండి సినిమా బలగం ఇందుకు చక్కటి నిదర్శనాలు. 

తెలంగాణ అంతటా ఇంచుమించు ఒకే యాస ఉన్నప్పటికీ ఏపీలో రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రా జిల్లాల యాసలు, అక్కడి సమస్యలు, జీవనవిధానాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కనుక చిన్న చిత్రాలకు మరింత ఎక్కువ అవకాశం ఉంది. 

అటువంటిదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా కూడా. శ్రీకాకుళం జిల్లాలోని అంబాజీపేటలో జరిగే కధతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు దుష్యంత్ కటికనేని. ఈ సినిమాలో సుహాస్, శివాని జంటగా నటిస్తున్నారు. సుహాస్ పాత్ర పేరు మల్లిగాడు. అతను ఓ సెలూన్‌లో పనిచేస్తూ మ్యారేజ్ బ్యాండ్ మేళంలో వాయిద్యకారుడుగా ఉన్నట్లు ఫస్ట్-లుక్ పోస్టర్‌లోనే చెప్పేశారు. కనుక ఈ సినిమాలో మంచి కామెడీ, రొమాన్స్ రెండూ ఉంటాయని ఆశించవచ్చు. 

ఈ సినిమాని 2024, ఫిబ్రవరి 2వ తేదీన విడుదల చేస్తున్నట్లు సినీ నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ఫిబ్రవరి 2న విడుదల చేయబోతున్నట్లు తెలియజేసేందుకు సుహాస్ గ్యాంగ్ చేసిన చిన్న స్కిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది ఇంకా ఆకట్టుకొంటుంది.