పెద్ద సినిమాలతో పోటీ పడాలని కాదు: ప్రశాంత్ వర్మ

చిన్న బడ్జెట్‌తో చిన్న సినిమాగా తెరకెక్కించిన హనుమాన్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఈరోజు హనుమాన్ ట్రైలర్‌ విడుదల సందర్భంగా సినీ జర్నలిస్టులతో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ముఖాముఖీ సమావేశమైనప్పుడు, “సంక్రాంతికి పెద్ద హీరోల భారీ బడ్జెట్‌ సినిమాలు విడుదలవుతున్నప్పుడు వాటితో మీ సినిమా పోటీ పడగలదా? కాస్త ముందుకో వెనక్కో జరుపుకోవచ్చు కదా? ఓపెనింగ్ కలెక్షన్స్ బాగుండేవి కదా?” అని ఓ సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నించారు. 

దానికి ప్రశాంత్ వర్మ చెప్పిన సమాధానం ఆయన ఆత్మవిశ్వాసాన్ని సూచించింది. “ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత జనవరి 12కి రిలీజ్ చేయాలని అనుకొన్నప్పుడు పెద్ద సినిమాలు ఏవీ లేవు. ఉత్తరాది రాష్ట్రాలలో సంక్రాంతి సమయానికి థియేటర్ల కోసం పెద్దగా పోటీ ఉండదు. కనుక మేము ఆ డేట్ ఫిక్స్ చేసుకొని ఉత్తరాదిలో డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు చేసుకొన్నాము. కనుక ఇక్కడా అదే డేట్‌కి మా సినిమా రిలీజ్ చేస్తున్నాము.

మీరు చెప్పిన్నట్లు ఏ సినిమాకైనా ఓపెనింగ్ కలెక్షన్స్ చాలా ముఖ్యమే. అయితే మా సినిమా ఓ నెల రోజులు ఆడించి థియేటర్లలో నుంచి తీసేసే సినిమా కాదని మా నమ్మకం. సినిమా కధ, కాన్సెప్ట్, గ్రాఫిక్స్ అన్నీ దేనికది ప్రత్యేకమైనదే కనుక ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి మా సినిమా చూస్తారని గట్టిగా నమ్ముతున్నాము. కనుక మా సినిమాకి లాంగ్ రన్ ఉంటుందని భావిస్తున్నాము. మాది చాలా చిన్న కనుక పెద్ద సినిమాలతో మేము పోటీ పడుతున్నామని కూడా భావించడం లేదు,” అని ప్రశాంత్ వర్మ సమాధానం చెప్పారు.