
మాస్ మహారాజ రవితేజ హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేదన్నట్లు వరుసపెట్టి సినిమాలు చేసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు నిరాశపరచగా, తర్వాత సినిమా ఈగల్ త్వరలో విడుదల కాబోతోంది. ఈగల్ పూర్తికాక ముందు రవితేజ దర్శకుడు హరీష్ శంకర్‌తో మరో సినిమా మొదలుపెట్టేశారు.
ఈ సినిమాకి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేరుతో ‘మిస్టర్ బచ్చన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘నామ్ తో సునా హోగా...!’ (పేరు వినే ఉంటారుగా) అంటూ సబ్ టైటిల్ పెట్టారు. అసలే రవితేజ, హరీష్ శంకర్ ఇద్దరూ పక్కా మాస్ యాక్టర్, డైరెక్టర్. వారి సినిమాకి ఇటువంటి మాస్ టైటిల్, సబ్ టైటిల్‌తో మంచి కిక్ స్టార్ట్ ఇచ్చారని చెప్పవచ్చు. ఈ సినిమా షూటింగ్ ఆదివారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభం అయ్యింది.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా బాలీవుడ్ నటి భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.