రేపే హనుమాన్ ట్రైలర్‌ విడుదల

యువదర్శకుడు ప్రశాంత్ వర్మ, యువనటుడు తేజ సజ్జల కాంబినేషన్‌లో రూపొందిన సోషియో ఫాంటసీ మూవీ హనుమాన్ ట్రైలర్‌ మంగళవారం యూట్యూబ్‌లో, థియేటర్లలో విడుదల కాబోతోంది. హైదరాబాద్‌లోని ఏఎంబీఏ సినిమాస్, కరీంనగర్‌లోని వేంకటేశ్వర థియేటర్లో మొదట హనుమాన్ ట్రైలర్‌ విడుదల చేస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశాడు. 

హనుమాన్ చాలా తక్కువ బడ్జెట్‌తో చిన్న సినిమాగా రూపొందినప్పటికీ అద్భుతమైన గ్రాఫిక్స్‌తో విడుదల చేసిన టీజర్ అందరినీ విశేషంగా ఆకర్షించింది. అదే సమయంలో వందలకోట్లు ఖర్చు చేసి ప్రభాస్ ప్రధానపాత్రలో నిర్మించిన ఆదిపురుష్ టీజర్‌, ట్రైలర్‌, చివరికి సినిమా కూడా చాలా నాసిరకంగా ఉండటంతో హనుమాన్‌కి చాలా తోడ్పడిందని చెప్పవచ్చు. 

ఈ సినిమాలో తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్‌, వెన్నెల కిషోర్, వినయ్ రాయ్, సత్య, గెటప్ శ్రీను, రాజ్ దీపక్ శెట్టి ముఖ్యపాత్రలు చేస్తున్నారు. హనుమంతుడి వలన దివ్యశక్తులు పొందిన ఓ యువకుడు దుష్టశక్తులతో చేసిన పోరాటమే ఈ సినిమా కధ.  

ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ సౌరభ్, కెమెరా: దాశరధి శివేంద్ర అందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం , హిందీ, మరాఠీ భాషలతో పాటు ఇంగ్లీష్, జపనీస్, కొరియన్, చైనీస్, స్పానిష్ భాషలలోను జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.