గుంటూరు కారం నుంచి మసాలా బిర్యానీ పాట లీక్!

త్రివిక్రమ్ శ్రీనివాస్‌-మహేష్‌ బాబు కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి ‘మసాలా బిర్యాని’ అంటూ సాగే ఓ వీడియో సాంగ్ లీక్ అయ్యింది. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమాని 2024, జనవరి 12న సంక్రాంతి పండుగకు విడుదల చేయాలనుకొన్నారు కనుక ఆ ప్రకారం పాటలు రిలీజ్ చేద్దామని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసుకొంటే సెట్స్‌లో నుంచి ఓ పాట లీక్ అవడంతో చాలా ఇబ్బందికరంగా మారింది. కనుక దీపావళి పండుగకు పూర్తి పాటను విడుదల చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

ఇక ఈ పాట సోషల్ మీడియాలోకి లీక్ అవడంతో లిరిక్స్ బాగోలేదని, కొరియోగ్రఫీ బాగోలేదంటూ అప్పుడే కామెంట్స్ కూడా మొదలైపోయాయి. అవి సినిమాపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కనుక సోషల్ మీడియాలో నుంచి ఈ పాటను తొలగించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. 

గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, రావు రమేష్, రమ్య కృష్ణ, జగపతి బాబు, జయరాం, బ్రహ్మానందం, సునీల్, రఘుబాబు, మహేష్ ఆచంట తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాను రూ.200 కోట్ల బడ్జెట్‌తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.