నేను హీరో అయ్యానంటే వారు ముగ్గురే కారణం

సినీ పరిశ్రమలో ఓ స్థాయికి ఎదిగిన తర్వాత చాలామంది ఒకప్పుడు తమకు సాయపడినవారిని పట్టించుకోరు. కానీ రౌడీ హీరోగా, పాన్ ఇండియా హీరోగా ఎదిగిన విజయ్‌ దేవరకొండ మాత్రం నేడు తాను ఈ స్థాయికి చేరుకోవడానికి కారకులైన ముగ్గురు దర్శకుల గురించి చెప్పుకొని వారికి అందరి ఎదుట కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 

తరుణ్ భాస్కర్ నటించి దర్శకత్వం చేసిన కీడాకోలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ, “నేను ఓ సాధారణ మద్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. కనుక నాకు అంతకు ముందు ఇండస్ట్రీలో ఎటువంటి పరిచయాలు లేవు. 

ఒకప్పుడు కలిసి చదువుకొన్న తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సందీప్ వంగా ముగ్గురూ దర్శకులుగా మారడం నాకు కలిసి వచ్చింది. వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించి నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. వారు ముగ్గురి ప్రోత్సాహం, సహకారమే లేకుంటే ఈరోజు నేనిలా మీ ముందు వేదికపై నిలబడి మాట్లాడగలిగేవాడినే కాదు. 

మనం కుటుంబ వాతావరణం, మన స్నేహితులు, మనం తీసుకొనే నిర్ణయాలే మన జీవితాలు ఏవిదంగా సాగాలో డిసైడ్ చేస్తాయని నేను అర్దం చేసుకొన్నాను. తరుణ్ భాస్కర్ ఈ కీడాకోలా సినిమాని చాలా అద్భుతంగా తీశాడు,” అని విజయ్‌ దేవరకొండ అన్నాడు.