
హేమంత్ ఎం.రావు దర్శకత్వంలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ జంటగా నటించిన ‘సప్త సాగరాలు దాటి-సైడ్ ఏ’ సినిమా ఓ చక్కటి ప్రేమకావ్యంగా మంచి టాక్ తెచ్చుకొన్నప్పటికీ థియేటర్స్ లభించకపోవడం వలన అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. అది ఓటీటీ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకొంది. ఇప్పుడు దీని రెండో భాగంగా తెరకెక్కించిన ‘సప్త సాగరాలు దాటి-సైడ్ బి’ నవంబర్ 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.
ఈ సినిమాలో అందమైన కలలు కంటున్న ఓ ప్రేమ జంట విడిపోయినప్పుడు వారి బాధ, భావోద్వేగాలను దర్శకుడు హేమంత్ రావు ఈ సినిమాలో చక్కగా చూపారు. ఓ ధనికుడి కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ వ్యక్తి చావుకి కారకుడవుతాడు. వారి ఇంట్లో కారు డ్రైవరుగా చేస్తున్న హీరో ఆ నేరం తన మీద వేసుకొని జైలుకి వెళితే ఆరు నెలల్లో బెయిల్‌పై బయటకు తీసుకురావడమే కాకుండా, భారీగా డబ్బు కూడా ముట్టజెప్పుతానని చెప్పడంతో హీరో చేయని నేరానికి జైలుకి వెళతాడు. అయితే అతను జైలుకి వెళ్ళిన తర్వాత ఆ ధనికుడు గుండెపోటు వచ్చి చనిపోవడంతో హీరో జైలులో ఖైదీగా మిగిలిపోతాడు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది ఈ సైడ్ ఏ, సైడ్ బి సినిమా కధ.
తెలుగులో విడుదలకాబోతున్న ఈ సినిమా సైడ్ బిని కూడా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుదల చేయబోతోంది. ఈ సినిమాకు సంగీతం: చరణ్ రాజ్, కెమెరా: అద్వైత గురుమూర్తి అందించారు.