ఘనంగా వెంకటేష్ కూతురు నిశ్చితార్ధ వేడుక

ప్రముఖ తెలుగు సినీ నటుడు విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయ వాహిని వివాహ నిశ్చితార్ధ కార్యక్రమం బంధుమిత్రులు, సినీ ప్రముఖుల సమక్షంలో బుధవారం ఘనంగా జరిగింది. వరుడు విజయవాడకు చెందిన ఓ వైద్యుడు కుమారుడని సమాచారం. వెంకటేష్ కుటుంబ సభ్యులు, వారి వ్యక్తిగత, కుటుంబ కార్యక్రమాలను మీడియాతో పంచుకొనేందుకు ఇష్టపడరు. కనుక ఈ వేడుకని కూడా మీడియాకు తెలియజేయకుండానే కానిచ్చేశారు.

అయితే ఈ వేడుకకు చిరంజీవి, మహేష్‌ బాబు, రానా, నాగా చైతన్య తదితరులు హాజరవడంతో ఈ విషయం మీడియాకి తెలిసింది. దీంతో ఈ వివాహ నిశ్చితార్ధ వేడుకకు సంబందించి కొన్ని ఫోటోలు మీడియాలోకి వచ్చాయి. వెంకటేష్ కుమార్తె వివాహం త్వరలో జరుగనుంది. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. 

వెంకటేష్ ప్రస్తుతం తన 75వ చిత్రం సైంధవ్ చేస్తున్నారు. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో రుహానీ శర్మ, ఆర్య, నవాజుద్దీన్ సిద్దిఖీ, సారా, శ్రద్ద శ్రీనాధ్, ఆండ్రియా జెరెమియా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషలలో తెరకెక్కుతున్న సైంధవ్ జనవరి 13న విడుదల కాబోతోంది.